న్యూ ఢిల్లీ,న్యూస్ వన్ ప్రతినిధి :
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి మొదట నుసిపురుగుల(fruit flies)ను పంపాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఎఫ్ఆర్) శాస్త్రవేత్తల బృందం ఈ నిర్ణయం తీసుకుంది.అంతరిక్ష ప్రయాణం చేస్తున్న సమయంలో జీవులపై ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేస్తున్నారు. అంతరిక్షానికి వెళ్తున్న సమయంలో వ్యోమగాములు ఎలాంటి జీవ మార్పులను గురవుతారో, ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటున్నారో అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు.నుసిపురుగుల శాస్త్రీయ నామం డ్రోసోఫిలా మెలనోగాస్టర్. దీనిని సాధారణంగా ఫ్రూట్ ఫ్లై అని పిలుస్తారు. జన్యు పరిశోధనలో దీన్ని ముఖ్యమైన మోడల్ ఆర్గానిజంగా వాడతారు. దీన్నే ఇస్రో తమ గగన్యాన్ ప్రాజెక్టు మొదటి ఫ్లైట్లో పంపనుంది.మనుషులకు వచ్చే వ్యాధులను ప్రభావితం చేసే అదే జన్యు లక్షణాలలో 75 శాతం వాటిలో ఉంటుంది. వివిధ పరిస్థితులకు జీవులు ఎలా పెరుగుతాయి? ఎలా అభివృద్ధి చెందుతాయి? ఎలా ప్రతిస్పందిస్తాయో అధ్యయనం చేయడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.శాస్త్రవేత్తలకు మనిషి ఆరోగ్యం గురించి మరింత తెలుసుకోవడానికి మరింత సహాయపడుతుంది. అందుకే నుసిపురుగులను శాస్త్రవేత్తలు తమ ప్రయోగంలో వాడుతున్నారు.డ్రోసోఫిలాతో చేస్తున్న తమ ప్రయోగాలు స్వల్పకాలిక అంతరిక్ష ప్రయాణ ప్రభావాలను తెలియజేస్తాయని శాస్త్రవేత్తలు అన్నారు. వారం రోజుల మైక్రోగ్రావిటీలో జీవక్రియ ఫిట్నెస్, హెల్త్స్పాన్ ఎలా ప్రభావితం అవుతుందో అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.కాగా, భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం ఇప్పటికే వ్యోమగాములు ఎంపికయ్యారు. వారంతా భారత వాయుసేనకు చెందినవారే. గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా అంతరిక్షంలోకి వెళ్తారు.