Thursday, March 13, 2025
spot_img
Homeలోకల్ వార్తలుఅక్రమ అరెస్టులు, గృహ నిర్బంధం పై కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ఆందోళన.

అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధం పై కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ఆందోళన.

కనీస వేతనాలు అమలు , సమ్మె ఒప్పందాలు జీవోలు ఇవ్వకుంటే సమ్మెకు సిద్ధమని హెచ్చరిక

. . విజయనగరం సిటీ న్యూస్ వన్ ప్రతినిధి :-

విజయనగరం /కలెక్టరేట్ అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా ధర్నాకు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధ సంఘం ) పిలుపునిస్తే అత్యంత నియంత్రత్వంగా అంగన్వాడీల ఇళ్ళకెళ్లి నిర్బంధించిందని, రైల్వే స్టేషన్ లో ,మార్గమధ్యంలో అరెస్టులు చేసి , విజయవాడ ఎవరు వెళ్లకుండా ఈరోజు బలవంతంగా సెక్టార్ మీటింగ్ లు జరపాలని ఐసిడిఎస్ అధికారులను ఆదేశించడం ద్వారా అంగన్వాడీలపై తీవ్ర ఒత్తిడి తేవాలని ప్రభుత్వం భావించడం అత్యంత దుర్మార్గమని ఆ యూనియన్ జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు బి పైడ్రాజు, ఎస్ అనసూయ తెలిపారు. ప్రభుత్వ నిర్బంధాన్ని సైతం ఎదుర్కొని వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు విజయవాడ వెళ్లారని తెలిపారు. అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాన్ని నిరసిస్తూ సెక్టార్ మీటింగ్ల ను బహిష్కరించి సోమవారం పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత గా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, గత ప్రభుత్వాధికారులతో జరిగిన రాతపూర్వక ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలని కోరుతూ విజయవాడలో ధర్నా కు వెళ్ళనివ్వకుండా నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున అంగన్వాడీలకు తీపి కబురు అని చెప్పి మోసపూరిత గ్రాట్యూటీ జిఓ ఇచ్చారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలోనే ఈ జీవో ఇచ్చారని, అందుకు యూనియన్ అంగీకరించకపోవడంతో టీచర్ కు 1,40,000, హెల్పర్ కు 60000 గ్రాట్యూటీ చెల్లించే విధంగా అధికారులతో ఒప్పందం కుదిరిందని, ఈ ఒప్పందం ప్రకారం ‌ గ్రాట్యుటీ చెల్లింపు జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రిటైర్మెంట్ నాటికి చివరి జీతం లో సగం పెన్షన్ గా ఇవ్వాలని, అంగన్వాడీలకు కనీస వేతనం 26000 /- , మట్టి ఖర్చులు 20,000/-, అమలు చేయాలని, నూతన విద్యా విధానంలో భాగంగా PPE 1, PPE 2 ల పేరుతో సెంటర్లను బలహీనపరిచే కుట్రలను ఆపాలని, బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని, ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు, బిల్లులు, అద్దెలు పెంచాలని డిమాండ్ చేశారు.లేదంటే సమ్మెకు కూడా వెనకాడబోమని తెలిపారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ బాబు గ్యారెంటీలకు ఏ షూరిటీ లేదని, హామీలన్నీ గాలి మూటలేనని ఎద్దేవా చేశారు. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలని చెబుతున్న కూటమి ప్రభుత్వం ఐసిడిఎస్ లో గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు సర్వీస్ అందిస్తున్న లక్షలాదిమంది మహిళలకు ఎందుకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుందని ఓట్లు వేశారని, సమస్యలు చెప్పుకోవడానికి కనీసం విజయవాడకు కూడా రానివ్వకుండా గృహనిర్బంధం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం మారిన విధానం ఒకటేనని పోరాటం ద్వారానే హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు , కార్యదర్శులు పి. శంకర్రావు, కే సురేష్, బి సుధారాణి, ఏ. జగన్మోహన్రావు,ఉపాధ్యక్షులు టీవీ రమణ, బి సూర్యనారాయణ లు అంగన్వాడీల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా, ఐసిడిఎస్ అధికారులను, పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగించి అంగన్వాడీలను భయపెట్టి, బెదిరించి, అరెస్టులు, గృహనిర్బంధం ద్వారా ఉద్యమాన్ని అణిచి వేయాలని ధోరణి ప్రభుత్వం విడనాడాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని హితవు పలికారు. ప్రభుత్వం ఇదే వైఖరితో ఉంటే భవిష్యత్తులో కార్మిక ,ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధం కావలసి వస్తుందని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ కూడలిలో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు.కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడి ప్రాజెక్ట్ అధ్యక్ష, కార్యదర్శులు, సెక్టర్ లీడర్లు, మినీ వర్కర్లు, వర్కర్లు హెల్పర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.‌

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments