
(హైదరాబాద్,న్యూస్ వన్ ప్రతినిధి) :
కొందరు అధికారులు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి ఇష్టపడటం లేదని,ప్రభుత్వ అధికారుల మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్లో “లైఫ్ ఆఫ్ ఏ కర్మ యోగి- ఏ మెమరీ ఆఫ్ సివిల్ సర్వెంట్” అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుస్తకావిష్కరణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.గోపాలకృష్ణ రచించిన “లైఫ్ ఆఫ్ ఏ కర్మ యోగి” పుస్తకంలో తాను సివిల్ సర్వెంట్ గా ప్రజల కోసం ఏమేం చేశారో.. ఎలాంటి కష్టాలు ఎదుర్కొని, విజయాలు సాధించారో పొందుపరిచారని అన్నారు. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఈ పుస్తకాన్ని చదివి.. గోపాలకృష్ణ లాగ ప్రజల బాగు కోసం పాటుపడాలని సూచించారు. అధికారులు ప్రజాక్షేత్రంలో ఎంత తిరిగితే అంత మంచిది అని, ప్రజల అవసరాలు ఏంటో స్వయంగా తెలుసుకోవచ్చని అన్నారు.శంకరన్, శేషన్, మన్మోహన్ సింగ్ లాంటి అధికారులను ప్రతిక్షణం అధికారులు గుర్తు చేసుకుంటూ ఉండాలన్నారు. అయితే కొంతమంది అధికారులు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళకుండా ఏసీ గదులకు మాత్రమే పరిమితం అవుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశ పెట్టినా అవి అధికారుల ద్వారా మాత్రమే ప్రజలకు చేరతాయని, అధికారులు ఏసీ గదులు వదిలి రాకపోతే అవి ఏ విధంగా వారికి అందుతాయని ప్రశ్నించారు. గతంలో ఐఏఎస్ అధికారులు నిత్యం ప్రజల్లో ఉండేవారని.. గతంలో అధికారులు, రాజకీయ నాయకులు అంశాలను ప్రస్తావిస్తే అందులోని లోతుపాతులు, లాభ నష్టాలను వివరించేవారని అన్నారు. కానీ ఈ రోజుల్లో ఎందుకో అది తగ్గిపోయిందన్నారు. అధికారులు నిబద్ధతతో పని చేస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలియ జేశారు.