
మూలవిరాట్ ను తాకని సూర్యకిరణాలు
రెండవ రోజూ నిరాశతో వెనుదిరిగిన భక్తులు
అరసవల్లి,న్యూస్ వన్ ప్రతినిధి :
శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించిన భక్తులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సోమవారం ఉదయం కూడా సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్‌ను తాకలేదు. ప్రతి ఏడాది రెండుసార్లు జరిగే ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో అరసవెల్లికి వస్తుంటారు. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల కారణంగా ప్రతీ యేడాది మార్చి 9, 10 తేదీల్లో ఉత్తరాయణం , అక్టోబర్ 1, 2 తేదీల్లో దక్షిణ యానం ఆనవాయితీగా వస్తోంది. సూర్యుడు దక్షిణయానం నుంచి ఉత్తరాయణంకు మారే సందర్భాన్ని పురస్కరించుకుని భక్తులు అరసవెల్లికి వచ్చారు. వరుసగా రెండ్రోజులు మూలవిరాట్ ను సూర్యకిరణాలు తాకుతాయని ఎదురు చూసి భంగపడ్డారు. మబ్బుల కారణంగా సూర్య కిరణాలు మూలవిరాట్ వరకు చేరుకోలేదు.
కాగా అరసవల్లిలో ఆదిత్యాలయం భక్తజన సంద్రమైంది. ఓ వైపు ఆదివారం.. మరోవైపు ఆదిత్యుడి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకనున్న నేపథ్యంలో ఉదయం 6 గంటలకే పెద్ద ఎత్తున భక్తులు అరసవల్లికి తరలివచ్చారు. క్యూలో బారులుదీరారు. కిరణాల తాకిడితో బంగారు వర్ణంలో మెరిసిపోనున్న ఆదిత్యుడ్ని దర్శించుకోవాలని భావించారు. కానీ ఆకాశంలో మబ్బుల కారణంగా కిరణాలు స్వామిని తాకలేదు. దీంతో భక్తులు నిరాశ చెందారు. అనంతరం స్వామిని దర్శించుకుని వెనుదిరిగారు. కొంతమంది భక్తులు ఇంద్రపుష్కరిణిలో స్నానాలు ఆచరించి రావిచెట్టు వద్ద పూజలు చేశారు. మరికొందరు క్షీరాన్నం వండి స్వామికి నైవేద్యం సమర్పించారు. ఆదివారం ఒక్కరోజే ఆదిత్యుడికి రూ.8,54,950 ఆదాయం లభించింది. ఇందులో టిక్కెట్ల ద్వారా రూ.5,97,800, విరాళాల ద్వారా రూ.91,525, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,65,635 వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలను తాకే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. వీరంతా తీవ్ర నిరాశకు గురై వెనుతిరిగారు.