
-ప్రపంచ మొదటి 20 నగరాల లిస్ట్ లో 13 భారత్ లోని నగరాలే.
-అస్సాంలోని బర్నిహాట్ అత్యంత కాలుష్య నగరంగా గుర్తింపు
( న్యూస్ వన్ ప్రత్యేక ప్రతినిధి )
ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య స్థాయిలను పరిశీలించే స్విస్ వాయు నాణ్యత టెక్నాలజీ సంస్థ ఇటీవల విడుదల చేసిన 2024 ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం.. అస్సాంలోని బర్నిహాట్ నగరం భారత్ లోనే అత్యంత కాలుష్య నగరంగా గుర్తింపు పొందింది. ఈ నివేదిక ప్రకారం.. భారతదేశం ప్రపంచంలో ఐదవ అత్యంత కాలుష్య దేశంగా నిలిచింది. ముఖ్యంగా, భారతదేశంలోని నగరాల్లో సూక్ష్మ ధూళి రేణువుల స్థాయి PM2.5లు చాలా అధికంగా నమోదయ్యాయి. అయితే, 2024లో భారతదేశంలో ఈ PM2.5 స్థాయిలు 7% తగ్గాయి. 2023లో 54.4 మైక్రోగ్రామ్‌లు ఉన్న ఈ స్థాయి, 2024లో 50.6 మైక్రోగ్రామ్‌లకు తగ్గింది.IQAir నివేదిక ప్రకారం, 2024లో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో భారతదేశం 5వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చాడ్, రెండవ స్థానంలో బంగ్లాదేశ్, మూడవ స్థానంలో పాకిస్తాన్, నాల్గవ స్థానంలో కాంగో ఉన్నాయి. అలాగే భారతదేశ రాజధాని న్యూఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని నగరంగా మరోసారి నిలిచింది. ఢిల్లీలో 2024లో సగటు వార్షిక PM2.5 స్థాయి 91.6 మైక్రోగ్రామ్‌లుగా నమోదైంది. ఇది 2023లో నమోదైన 92.7 మైక్రోగ్రామ్‌లతో పోలిస్తే కాస్త మెరుగైంది. ఇకపోతే, ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య నగరాల్లో టాప్ 20 నగరాల్లో 13 భారతదేశ నగరాలు ఉన్నాయి. వీటిలో బర్నిహాట్, ఢిల్లీ, ముల్లన్‌పూర్ (పంజాబ్), ఫరీదాబాద్, లోని, న్యూఢిల్లీ, గురుగ్రామ్, గంగానగర్, గ్రేటర్ నోయిడా, భివాడి, ముజఫర్‌నగర్, హనుమాన్‌గఢ్, నోయిడా లు ఉన్నాయి.భారతదేశంలో 35% నగరాలు WHO పరిమితికి (5 మైక్రోగ్రామ్‌లు) కంటే 10 రెట్లు ఎక్కువ PM2.5 స్థాయిలను నమోదు చేశాయి. వాయు కాలుష్యం కారణంగా భారతదేశ ప్రజల జీవితకాలం సగటున 5.2 సంవత్సరాలు తగ్గుతోందని నివేదిక వెల్లడించింది. 2009 నుండి 2019 వరకు ప్రతి ఏడాదికి 15 లక్షల మరణాలు PM2.5 కాలుష్య ప్రభావంతో సంభవించాయని ఓ పత్రిక అధ్యయనంలో పేర్కొంది. వాహనాల ఎమిషన్లు, పరిశ్రమల పొగలు, చెరకు లేదా గడ్డి దహనం వంటి అంశాలు PM2.5 స్థాయిలను పెంచుతున్నాయని నివేదిక చెబుతోంది.