Thursday, March 13, 2025
spot_img
Homeజాతీయ-వార్తలుగ్రూప్‌-2 పరీక్ష యథాతథం: ఏపీపీఎస్సీ

గ్రూప్‌-2 పరీక్ష యథాతథం: ఏపీపీఎస్సీ

175 పరీక్ష కేంద్రాల్లో 92,250 మంది

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

ఆలస్యంగా వస్తే అనుమతించేది లేదు

వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు

యదావిధిగా పరీక్షలు హై కోర్టు ఉత్తర్వులు

   ( న్యూస్ వన్ బ్యూరో )                               

         రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో గ్రూపు-2 ప్రధాన పరీక్ష నేడు జరగనున్నది.ఇప్పటికే  ప్రిలిమ్స్‌ ద్వారా 92,250 మంది ప్రధాన పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 మెయిన్‌ రాత పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ పేర్కొన్నారు.13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని 175 పరీక్షా కేంద్రాల్లో  పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.  పరీక్షలకు 92,250 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎక్కడైనా ఎవరైనా వదంతులు లేదా నకిలీ వార్తలు సోషల్‌ మీడియాలో  ప్రసారం చేసినా లేదా సర్క్యులేట్‌ చేసినా అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పేపర్‌ 1 రాత పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పేపర్‌ 2 పరీక్ష ఉంటుంది. ఉదయం సెషన్‌కు అభ్యర్థులు ఉదయం.9.30 గంటలలోపు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, 9.45 గంటలకు గేట్లను మూసివేస్తారు. అలాగే మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటల్లోగా పరీక్షా కేంద్రాలకు అభ్యర్ధులు చేరుకోవాల్సి ఉంటుంది. ఆలస్యంగా వచ్చిన ఎవ్వరినీ లోనికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు చెప్పారు.

ఆలస్యంగా వస్తే అనుమతించేది లేదు :

చైర్‌పర్సన్‌ అనురాధ మాట్లాడుతూ.. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పేపర్‌– 1 రాత పరీక్ష ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఉదయం.9.30 గంటలలోపు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 9.45 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేయాలని, ఆలస్యంగా వచ్చిన ఎవ్వరినీ లోనికి అనుమతించ కూడదని స్పష్టం చేశారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకూ పేపర్‌–2 పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు మధ్యాహ్నం 2.30 గంటల్లోగా ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, 2.45 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసి ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోను అభ్యర్థులెవరినీ లోనికి అనుమతించకూడదని ఆమె స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు చెప్పారు.

గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్

అనంతపురం జిల్లాలో ఆదివారం జరగనున్న గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. నగరంలో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించే SSBN, ఎస్వీ డిగ్రీ కళాశాలల్లో ఆయన తనిఖీలు చేశారు. అక్కడ అధికారులు చేసిన ఏర్పాట్లపై అరా తీశారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్ష సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

యదా విధిగా పరీక్షలు : హై కోర్టు

రాష్ట్రంలో ఆదివారం జరగాల్సిన గ్రూపు-2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలుచోట్ల అభ్యర్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రతిభావంతులకు అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. ‘వైకాపా ప్రభుత్వంలో 2023 డిసెంబరులో గ్రూపు-2 షార్ట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. పూర్తి వివరాలతో మరో నోటిఫికేషన్‌ మూడు వారాల అనంతరం విడుదలచేశారు. 1996నాటి ఉద్యోగుల నియామకాల సర్వీసు వ్యవహారాలకు సంబంధించిన జీఓను సవరిస్తూ కొత్తగా జీఓ 77ను వైకాపా ప్రభుత్వం జారీచేసింది. మహిళలు, స్పోర్ట్స్, మాజీ సైనికోద్యోగుల కోటాలో భర్తీ చేయాల్సిన పోస్టులకు సంబంధించి ముందుగానే రోస్టర్‌ పాయింట్లు నిర్ధారించారు. దీనివల్ల అన్ని కేటగిరీల్లోని ప్రతిభావంతులైన జనరల్‌ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది. రోస్టర్‌ పాయింట్ల అమలు విషయంలో స్పష్టత వచ్చేవరకు గ్రూపు-2 ప్రధాన పరీక్షను నిర్వహించకూడదు. వాయిదా వేయాలి’ అని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. విశాఖ, అనంతపురం, ఇతరచోట్ల పలువురు అభ్యర్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అనంతపురంలో అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో పలువురు అభ్యర్థులు శిక్షణ కేంద్రాల నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ కలెక్టర్‌ వినోద్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అందచేశారు. అలాగే ఏపీపీఎస్సీ కార్యాలయానికి, ప్రభుత్వానికి వివిధ రూపాల్లో విజ్ఞప్తులు పంపారు. ‘గత ప్రభుత్వం హయాంలో వచ్చిన గ్రూపు-2 నోటిఫికేషన్‌కు సంబంధించి రోస్టర్‌ విధానంలో అనేక తప్పులున్నాయి. వాటిని సవరించాలని అప్పటినుంచి కోరుతున్నా ఏపీపీఎస్సీ అధికారులు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వంలోనైనా న్యాయం చేస్తారని భావిస్తున్నాం. ఇదే విధానంలో పరీక్ష రాస్తే ఎంపికైన అభ్యర్థులు భవిష్యత్‌లో న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రోస్టర్‌ను మార్చిన తర్వాతే పరీక్ష నిర్వహించాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం’ అని విశాఖలో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న అభ్యర్థులు హెచ్చరించారు. ఎమ్మెల్సీ చిరంజీవిరావు నిరుద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ దృష్టికి తీసుకువెళ్లానని అక్కడ నుంచి సానుకూల సమాధానం వస్తుందని ఆందోళన విరమించాలని కోరారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments