
కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు ధర్నా ..జెసి కి వినతి
విజయనగరం సిటీ (న్యూస్ వన్ ప్రతినిధి) :
మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి మల్యాడ రామారావుపై టిడిపి మక్కువ మండల పార్టీ అధ్యక్షులు గుల్ల వేణుగోపాల్ నాయుడు ఆదివారం దాడికి పాల్పడ్డారు. చంపుతానని బెదిరించారు వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టు సంఘాలు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు .ధర్నా ను ఉద్దేశించి జర్నలిస్టు సంఘాలు నాయకులు శివ ప్రసాద్, ఎం ఎం నాయుడు, కోటేశ్వరరావు, రాము లు మాట్లాడుతూ ‘ఎన్నికల కోడ్ అధికారులకు పట్టదా?’ అనే శీర్షికతో ఈనెల 3వ తేదీన ప్రజాశక్తి దినపత్రికలో వార్త వచ్చింది. దీనిపై కక్ష పెట్టుకున్న వేణుగోపాల్ నాయుడు ఈనెల 16న ఆదివారం ఎ. వెంకంపేట కాశీపట్నం రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లిన విలేకరి రామారావుపై తీవ్రంగా ఊగిపోతూ ‘మా మంత్రిగారిపైనే వార్తలు రాస్తావా? అంటూ ఏకవచనం, అసభ్యకరమైన పదజాలంతో బౌతిక దాడికి పాల్పడ్డారన్నారు. ‘నేను రాసింది మంత్రిగారిపై కాదు ఎన్నికల కోడ్ అమలు తీరుపైన’ అంటూ విలేకరి సముదాయించినప్పటికీ వేణగోపాలనాయుడు మాత్రం అవేవీ పట్టించుకోకుండా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోవడం సరికాదన్నారు.. ‘మాపైన వార్తలు రాయడానికి విలేకరులంతా భయపడతారు… ఎవరికీ లేని బాధ నీకెందుకు’ అంటూ రామారావుపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు భార్యా, పిల్లలకి కూడా దూరమైపోతావు ఈ రోజు అంటూ బెదిరించారన్నారు. ఈనేపథ్యంలో అదే రోజు (ఆదివారం) మక్కువ పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. సమాజ శ్రేయస్సు కోసం వార్తలు రాస్తున్న ప్రజాశక్తి విలేకరి రామారావుపై దాడికి పాల్పడిన వేణుగోపాల్ నాయుడు పై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని కోరుతున్నామన్నారు.ఇదే పద్ధతి కొనసాగితే మరింత ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా లో అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.