అమరావతి,న్యూస్ వన్ ప్రతినిధి:
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వంలోని ఇతర శాఖల్లో చోటు కల్పించి, వారికి జాబ్చార్టుతోపాటు, ప్రమోషన్‌కు అవకాశం కల్పించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది.
ఇందులో భాగంగా డిజిటల్ అసిస్టెంట్లను ప్రణాళిక శాఖలో మండల స్థాయిలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల్లో భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారుల కమిటీని నియమిస్తూ జనవరి 31న ప్రభుత్వం జీవో ఇచ్చింది. స్వర్ణాంధ్ర-2047లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లను ప్రణాళిక శాఖలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈవిధంగా వారికి జాబ్‌చార్ట్ ఉంటుందని, ప్రమోషన్‌కి చానల్ అందుబాటులోకి వస్తుందని భావించారు. వీరిని ప్రణాళిక శాఖ నిర్వహించే ఆర్థిక సామాజిక సర్వే, పారిశ్రామిక, జలవనరుల గణాంకాలు, ఇతర అంచనాల రూపకల్పనలో భాగస్వాములు చేయాలనుకున్నారు. ఇందుకోసం మండలాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారి స్థానాలను డిజిటల్ అసిస్టెంట్లతో భర్తీ చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు పరిశీలించి, పోస్టులు భర్తీ చేసేందుకు ఏడుగురు అధికారులతో జనవరి 31న కమిటీ నియమించారు. ఇప్పుడు ఆ కమిటీని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం జీవో ఇచ్చింది.