
అమెరికా వీసాను పునరుద్ధరించుకోవాలని భావిస్తున్నవారికి చేదు వార్త. వీసాల పునరుద్ధరణ కోసం తీసుకొచ్చిన డ్రాప్‌బాక్స్ నిబంధనలను అగ్రరాజ్యం కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. ఇకపై ఈ విధానం కింద గత 12 నెలల్లో గడువుతీరిన వీసా లను మ్తాసరమే ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకుముందు 48 నెలల కాలానికి ఈ సదుపాయం అందుబాటులో ఉండేది. తాజా నిబంధనలను తక్షణమే అమల్లోకి తెచ్చినట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ, ఇప్పటికే వీసా దరఖాస్తు కేంద్రాల్లో కొత్త నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిసింది.తాజా నిబంధనలతో హెచ్-1బీ (H-1B), సహా బీ1/బీ2 (B1/B2) వంటి నాన్‌ఇమిగ్రెంట్ వీసాదారుల దరఖాస్తులపై తీవ్ర ప్రభావం పడనుంది. వీరు వీసా పునరుద్ధరణకు సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనే అకాశం ఉంది. వాస్తవానికి కొవిడ్ ముందు వరకు ఇంటర్వ్యూ లేకుండా వీసా పునరుద్ధరణ కోసం 12 నెలల నిబంధనే అమల్లో ఉండేది. ఆ తర్వాత వీసా మంజూరు, పునరుద్ధరణకు పడుతున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని 2022లో ఈ డ్రాప్‌బాక్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. తాజా మార్పులతో భారతీయ దరఖాస్తుదారులకు వీసా పునరుద్ధరణ మరింత ఆలస్యం కానుంది