హైదరాబాద్ :తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ హై కమాండ్ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై గత నెల 5న తీన్మర్ మల్లన్నకు షోకాజ్ నోటీసు ఇచ్చిన కాంగ్రెస్.. ఫిబ్రవరి 12 లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే గడువు తీరిపోయినా తీన్మార్ మల్లన్న నుంచి ఎటువంటి వివరణా అందకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్. అయితే తీన్మార్ మల్లన్నగానే గుర్తుంపు పొందారు. జర్నలిస్టుగా మొదలై రాజకీయ వేత్తగా మారిన తీన్మార్ మల్లన్న2021లో బీజేపీలో చేరారు. అయితే అక్కడ ఎక్కువకాలం మనలేదు. ఆ తరువాత 2023లో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2024లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఇటీవలి కాలంలో తీన్మార్ మల్లన్న పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలవడమే కాకుండా.. పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయనకు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయినా ఆయన తీరులో మార్పు రాకపోవడంతో చివరికి సస్పెండ్ చేసింది. కాగా కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షీ నటరాజన్ తెలంగాణ పర్యటనకు వచ్చిన మరుసటి రోజే తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు పడటం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ క్రమశిక్షణ గీత దాటితో వేటు ఖాయమన్న సంకేతాన్ని నటరాజన్ ఈ విధంగా ఇచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి.