
దిశా యాప్ ప్లేసులో ఇప్పుడు శక్తి యాప్
ఈగల్ తరహాలో ఐజీ స్థాయి నేతృత్వం
మహిళా దినోత్సవం నాడు ఆవిష్కరణ
సీఎం చేత ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత
( క్రైమ్ బ్యూరో )
వైసీపీ ప్రభుత్వంలో పస లేని దిశ చట్టాన్ని పక్కన పెట్టి సరికొత్తగా శక్తి యాప్ ని తీసుకువస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత మండలిలో ప్రకటించారు. నెట్ వర్క్ లేని రిమోట్ ప్రదేశాల్లో కూడా పనిచేసేలా ప్రత్యేకంగా యాప్ ని తీర్చిదిద్దుతున్నట్లు తెలియజేశారు. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చేతులమీదుగా ‘శక్తి యాప్ ‘ను ఆవిష్కరించనున్నట్లు హోంమంత్రి అనిత పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ విభాగం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈగల్ తరహాలో ఐజీ స్థాయి ఐపీఎస్ అధికారి దీనికి నేతృత్వం వహిస్తారన్నారు. మహిళలకు రాజకీయాలకతీతంగా రక్షణ చర్యలు చేపడతామని ఆమె స్పష్టం చేశారు. మహిళల భద్రత విషయంలో రాజీపడబోమన్నారు. దిశ యాప్ తో గత ప్రభుత్వంలో రక్షణ ఉండేదన్న వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ చట్టం కింద ఫిర్యాదు చేసిన కేసు ఒక్కటైనా ఉందా? ‘దిశ’ కేవలం ప్రచారానికే పరిమితమైందన్నారు. ఐదేళ్లలో దిశ చట్టాన్ని ఎందుకు చేయలేదు? అంటూ సూటిగా ప్రశ్నించారు. దిశ యాప్‌కు చట్టబద్ధత ఎక్కడుంది? ఎంతమందిని యాప్ ద్వారా కాపాడారు? వివరాలు చెప్పాలని హోంమంత్రి డిమాండ్ చేశారు. వేధింపులు జరిగితే దిశ చట్టం కింద ఫిర్యాదు చేసిన కేసు ఒక్కటైనా ఉందా? అని అడిగారు.
దిశ చట్టం పేరుతో విస్తృత ప్రచారం చేశారు కానీ దానికి చట్టబద్ధత ఉందో లేదో చెప్పాలని అనిత వైసీపీ సభ్యులను ప్రశ్నించారు. శక్తి యాప్‌లో పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం 2013 పీఓఎస్‌హెచ్ చట్టం అమలు చేస్తామన్నారు.మహిళల రక్షణే ధ్యేయంగా ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసే వ్యవస్థ అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్త్రీ,శిశు సంక్షేమ శాఖ పని ప్రదేశాల్లో చట్టపరమైన పరిణామాల అవగాహన కోసం అవగాహన కల్పిస్తున్నామని హోంమంత్రి ప్రకటించారు. వైసీపీ తెచ్చిన దిశ యాప్ తో మగవాళ్లకు మాత్రమే ప్రయోజనం కలిగిందని ఒక్క మహిళను కూడా ఆపదలో ఉన్నప్పుడు రక్షించలేదన్నారు. శక్తి యాప్ నెట్ వర్క్ లేని చోట కూడా పని చేస్తుందని తెలిపారు.
వైఎస్ఆర్‌సీపీ హయాంలో దిశ చట్టాన్ని తీసుకు వచ్చారు. హైదరాబాద్ లో దిశ ఘటన జరిగినప్పుడు.. ఏపీలో సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆడబిడ్డలపై ఆఘాయిత్యాలకు పాల్పడితే ఉరి శిక్ష వేస్తామని ఓ చట్టాన్ని తీసుకు వచ్చారు. ఆ చట్టం పేరుతో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అయితే ఆ చట్టానికి కేంద్రం ఆమోద ముద్ర వేయలేదు. అవి చాలా వరకూ కేంద్రం చేసిన చట్టాలకు భిన్నంగా ఉండటంతో వెనక్కి పంపారు. చట్టాలను కేంద్ర ప్రభుత్వమే చేయాలి. రాష్ట్రం కూడా చేయవచ్చు కానీ ఆ చట్టాలకు అనుగుణంగానే ఉండాలి. ఈ కారణంగా దిశ చట్టం అనేది అమల్లోకి రాలేదు. అయితే దిశ చట్టం అమల్లోకి వచ్చిందని ఉరి శిక్షలు కూడా వేశామని అప్పటి హోంమంత్రి గా ఉన్న సుచరిత ప్రకటించడం వివాదాస్పదం అయింది. అదే సమయంలో దిశ యాప్ ను కూడా తీసుకు వచ్చారు. ఏపీలోని ప్రతి ఒక్కరి ఫోన్ లో దిశ యాప్ ఉండాలని పోలీసులు పట్టుబట్టి డౌన్ లోడ్ చేయించారు. ఎవరైనా ఆపదలో ఉంటే.. యాప్ ఓపెన్ చేసి రెండు సార్లు షేక్ చేసినా పోలీసులు వచ్చేలా యాప్ ను రూపొందించారు. అయితే ఆ యాప్ వల్ల పెద్దగా ఉపయోగం లేదన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం మరింత ఎక్కువ సర్వీసులు అందించేలా కొత్తగా శక్తి యాప్ ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. మహిళా దినోత్సవం నాడు ఆవిష్కరించనుంది.