మత్స్యశాఖకు మంజూరైన నిధులతో జెట్టీల నిర్మాణం చేపట్టాలి-
జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆదేశాలు
రాజు (విజయనగరంన్యూస్ వన్ ప్రతినిధి)
జిల్లాలో జాతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నబార్డు) ఆర్ధిక సహాయంతో గ్రామీణ మౌళిక సదుపాయాల అభివృద్ధి నిధి(ఆర్.ఐ.డి.ఎఫ్) కింద ప్రాజెక్టులు చేపట్టిన ప్రభుత్వ శాఖలు ఆయా పనులను త్వరగా పూర్తిచేసి సంబంధిత పనులపై నివేదికలను నబార్డు అధికారులకు వెంటనే అందజేయాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆదేశించారు. జిల్లాలో నబార్డు - ఆర్.ఐ.డి.ఎఫ్. నిధులతో చేపట్టిన పనులపై జిల్లా కలెక్టర్ ఆ బ్యాంకు అధికారులు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం సమీక్షించారు. జిల్లాలో పది ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రూ.926.60 కోట్ల అంచనా వ్యయంతో 203 ప్రాజెక్టులను చేపట్టగా, వీటిలో నబార్డు నుంచి ఆర్.ఐ.డి.ఎఫ్. కింద రూ.636.35 కోట్ల నిధులను కేటాయించడం జరిగిందని నబార్డు ఏ.జి.ఎం. నాగార్జున తెలిపారు. ఇందులో రూ.423.06 కోట్లు ఆయా ప్రభుత్వ శాఖలు ఖర్చుచేయడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు నబార్డు నిధులతో చేపట్టిన రోడ్లు, స్కూలు భవనాలు, ఆసుపత్రులు, అంగన్ వాడీ భవనాలు, అగ్రిల్యాబ్లు తదితర మౌళిక వసతుల ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత స్థితిపై కలెక్టర్ సమీక్షించారు.మత్స్యశాఖ ఆధ్వర్యంలో రూ,25.65 లక్షలతో పనులు మంజూరైనప్పటికీ చేపట్టనందున ఆ నిధులను వినియోగించి పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో మత్స్యకారులకు ఉపయోగపడే విధంగా రెండు ఫిషింగ్ జెట్టీల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని మత్స్యశాఖ డి.డి. నిర్మలాకుమారి, విద్య, సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ అధికారి డివిఎన్ మూర్తిలను ఆదేశించారు. బి.సి.రెసిడెన్షియల్ స్కూల్ భవనాల నిర్మాణం పూర్తయినప్పటికీ బిల్లులు చెల్లించలేదని సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం ఇ.ఇ. వివరించారు. ఇదే విషయాన్ని బ్యాంకుకు నివేదించాలని కలెక్టర్ సూచించారు. రెండు సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలు చేపట్టి పూర్తిచేయడం జరిగిందని, బిల్లులు కూడా చెల్లించామని తెలిపారు.వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా నియోజకవర్గ స్థాయిల్లో ఏడు ల్యాబ్ ల నిర్మాణం పోలీసు గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టగా జిల్లా స్థాయి ల్యాబ్ మినహా మిగిలిన పనులన్నీ పూర్తిచేయడం జరిగిందని వ్యవసాయశాఖ జె.డి. వి.టి.రామారావు తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా ఏడు రోడ్ల పనులను మంజూరు చేయగా వీటిలో ఒక రోడ్డు పని పూర్తయ్యిందని, నాలుగు పనులు జరుగుతున్నాయని, మరో పని కాంట్రాక్టు సంస్థకు అప్పగించాల్సి వుందని ఎస్.ఇ. శ్రీనివాస్ వివరించారు. వేపాడ మండలంలో సోంపురం-అతవ రోడ్డు పనిని మార్చి 15లోగా పూర్తిచేసి కాంట్రాక్టరుకు బిల్లు చెల్లించాలని కలెక్టర్ ఆదేశించారు. తెర్లాం మండలంలోనే మూడు రోడ్ల నిర్మాణాన్ని రూ.6.05 కోట్లతో చేపట్టామన్నారు.వైద్య ఆరోగ్య ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఆసుపత్రుల నిర్మాణం పనులు దాదాపుగా పూర్తయ్యాయని మార్చి నాటికి పెండింగ్ పనులు కూడా పూర్తిచేయడం జరుగుతుందని ఇ.ఇ. వివరించారు.సమగ్రశిక్ష ఆధ్వర్యంలో చేపట్టిన పాఠశాల అదనపు భవనాల పనులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఏ నిధుల నుంచి కేటాయించారో స్పష్టత లేనందున ఎన్ని పాఠశాల భవనాలు నిర్మిస్తున్నదీ సమాచారాన్ని ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ నీటిసరఫరా, మహిళాశిశు అభివృద్ధి సంస్థ ద్వారా చేపట్టిన పనులపై కూడా కలెక్టర్ సమీక్షించారు సమావేశంలో గ్రామీణ నీటిసరఫరా ఎస్.ఇ. కవిత, సమగ్రశిక్ష, మహిళాశిశు అభివృద్ధి శాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.