మాజీలు ఆశలన్నీ నామినేటెడ్ పైనే
నామినేటెడ్ పదవులు మరింత జాప్యం
ఉత్తరాంధ్రకి ఎన్ని పదవులు ఇస్తారు
కమిటీలకు మార్చి చివరి వరకు ఆగాల్సిందే
( న్యూస్ వన్ బ్యూరో )
నిన్నటి వరుకు ఎమ్మెల్సీ పదవి కోసం ఉత్తరాంధ్రలో సీనియర్లు జూనియర్లు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అధినాయకత్వం కళ్ళలో పడడానికి విశేషంగా శ్రమించారు. కానీ అనూహ్యంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ మహిళా నాయకురాలు కావలి గ్రీష్మకు ఈ పదవి వరించింది.దాంతో డీలా పడిన ఆశావహులకు ఇపుడు మరో పరుగు పందెం సిద్ధంగా ఉంది. తొందరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని టీడీపీ అధినాయకత్వం చెబుతోంది. దాంతో కీలకమైన పదవులను దక్కించుకోవడానికి మళ్ళీ ఎవరి ప్రయత్నాలలో వారు ఉన్నారు.కూటమిలోని మూడు పార్టీలలోని నాయకులు అంతా నామినేటెడ్ పోస్టుల మీదనే దృష్టి సారించారు. ఈ పదవులు కనుక భర్తీ అయితే ఇప్పట్లో మళ్లీ అవకాశాలు రావు అన్నది తెలిసిందే. దాంతో ఏదో విధంగా పదవి అందుకుంటే అదే పదివేలు అన్నది ఆలోచనగా ఉంది.ఇప్పటికి రెండు విడతలుగా నామినేటెడ్ పదవుల భర్తీ సాగినా ద్వితీయ తృత్రీయ శ్రేణి నేతలకు అవి పెద్దగా దక్కలేదు. అలాగే సీనియర్లు కూడా చాలా మంది వేచి చూస్తున్నారు. దీంతో ఈసారి కొడితే జాక్ పాట్ నే కొట్టాలన్నది ప్రతీ వారి ఆలోచనగా ఉంది.ఉత్తరాంధ్రకి ఎన్ని పదవులు ఇస్తారు అందులో టీడీపీకి ఎన్ని దక్కుతాయన్నది తమ్ముళ్ళు లెక్కించుకుంటున్నారు. తమకు పదవులు దక్కేలా చూడాలని పార్టీలోని పెద్ద నాయకులను కూడా కలుస్తున్నారు. ఉగాది లోపల పదవుల పందేరం ఉంటే అదే అసలైన ఉగాది అని అంటున్నారు.
కూటమి ప్రభుత్వం ఇటీవల నామినేటెడ్ పదవుల ఎంపిక ప్రకియను పూర్ చేసింది. పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకాలు వడివడిగా నియమించింది. నియోజకవర్గాల వారీగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు.. ఆయా పార్టీలకు విధేయులు.. ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. పార్టీ కోసం కష్టపడే నాయకులకు ఏదో ఒక కార్పొరేషన్లో అవకాశం కల్పించారు. చాలా వరకు పదవుల భర్తీ పూర్తయిన నేపథ్యంలో మిగిలిన ఆశావహులు వ్యవసాయ మార్కెట్ కమిటీలు(ఏఎంసీలు), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్‌లు), పలు దేవాలయాల పాలకవర్గాల్లో చోటు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికల రావడంతో కాస్త బ్రేక్ పడింది. ఇప్పడు నియోజకవర్గాల్లో ఏఎంసీ ఛైర్మన్లకు ఓ స్థాయి ఉంటుంది. వైకాపా ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఏఎంసీలకు పాలక వర్గాలను నియమించినా.. అక్కడ కార్యకలాపాలు చేపట్టడానికి నిధులు లేక.. వారు ఉత్సవ విగ్రహాలుగా మారారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థలను గాడిన పెట్టే క్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా కార్యాచరణ చేసారు. ఏఎంసీ ఛైర్మన్ల కోసం జిల్లా యూనిట్‌గా గత నెల 30న రిజర్వేషన్లు ఖరారు చేశారు. ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లోని 9 వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్లకు రిజర్వేషన్లు ఖరారు చెయడం కూడా జరిగింది.
పీఏసీఎస్‌లను కొన్నేళ్లుగా త్రిసభ్య కమిటీలతో నెట్టుకువస్తూ ప్రతి ఆరునెలలకోసారి పొడిగిస్తున్నారు. వీటికి ఇటీవల మరోసారి గడువు ముగిసింది. జిల్లాలో 166 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా.. వీటికి త్రిసభ్య కమిటీ సభ్యుల పేర్లను ఆయా నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు ఎంపిక చేసి పార్టీ కార్యాలయాలకు పంపారు. కొన్ని చోట్ల సభ్యుల వివరాలను సైతం వారు ప్రకటించారు.