
ఆసీస్‌తో సెమీస్ సమరానికి భారత్ సై
తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్దమైంది
ఆసీస్‌ను ఈసారి వదలొద్దంటున్న ఫాన్స్
దామోదర్ గోవింద్ ( ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ )
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో 2025లో భాగంగా తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్దమైంది. మంగళవారం(మార్చి 4) దుబాయ్ వేదికగా సెమీఫైనల్-1లో భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్ గాయం కారణంగా కీలకమైన సెమీఫైనల్‌కు దూరమయ్యాడు. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో షార్ట్ తొడకండరాలు పట్టేశాయి.దీంతో అతడికి విశ్రాంతి అవసరమని క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం సూచించారు. తద్వారా అతడు సెమీఫైనల్‌కు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని యువ ఆల్‌రౌండర్ కూపర్ కొన్నోలీతో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉన్న కొన్నోలీ.. ఇప్పుడు ప్రధాన జట్టులోకి వచ్చాడు. కొన్నోలీకి అద్భుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఇటీవలే జరిగిన బిగ్‌బాష్ లీగ్-2025 సీజన్‌లో కూపర్ దుమ్ములేపాడు. అదేవిధంగా ఈ యువ ఆల్‌రౌండర్ ఆస్ట్రేలియా తరపున ఇప్పటివరకు ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అందులో మూడు వన్డేలు ఉన్నాయి. అయితే తుది జట్టులో మాత్రం టాప్-ఆర్డర్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ లేదా కొన్నోలీకి చోటు దక్కే అవకాశముంది. అదనపు స్పిన్ అప్షన్ కావాలని ఆసీస్ మెనెజ్‌మెంట్ భావిస్తే కొన్నోలీకే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం ఖాయం.ఇక సెమీస్ పోరు కోసం ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న కంగారులు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు ఆర్హత సాధించాలని స్మిత్ సేన భావిస్తోంది. మరోవైపు భారత్ మాత్రం వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని కసితో ఉంది.
మెగా టోర్నీల్లో ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేయకూడదు. అందుకు ఉదాహరణ గత వన్డే ప్రపంచ కప్. ఆరంభంలో తడబాటుకు గురైనా.. ఫైనల్‌కు చేరుకొని భారత్‌కే షాక్ ఇచ్చి కప్‌ను ఎగరేసుకుపోయింది. ఇప్పుడు కూడా అంతే. తొలుత ఈ స్క్వాడ్‌ను చూసిన క్రీడా పండితులు కనీసం గ్రూప్ స్టేజ్‌ను కూడా దాటడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. దానికి కారణం.. ఇతర జట్లలో మాదిరిగా స్టార్ పేసర్లు ఆసీస్‌కు లేరు. దాదాపు అంతా కొత్తవారే. ఒకేఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ ఆడమ్ జంపాతోనే ఆ జట్టు బరిలోకి దిగుతోంది. గ్రూప్ స్టేజ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు 350+ పరుగులు రాబట్టారంటే ఆసీస్ బౌలింగ్ ఎలాఉందో అర్థం చేసుకోవచ్చు. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అఫ్గాన్ కూడా 270+ పరుగులు చేసింది. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ వంటి పేసర్లు లేకపోవడంతో ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్ బలహీనంగా మారింది. వీరంతా గాయాలకారణంగా టోర్నీకి ముందే దూరమైన సంగతి తెలిసిందే. స్పెన్సర్ జాన్స్, నాథన్ ఎల్లిస్, డ్వారిషూస్.. ఉన్నప్పటికీ అంతర్జాతీయస్థాయిలో వారికి అనుభవం తక్కువ. భారత్‌తో పోలిస్తే ఆసీస్ పేస్ విభాగం బలహీనమైందే.
ఆసీస్‌కు బ్యాటింగే బలం :
ఈసారి ఆస్ట్రేలియా ప్రధానంగా బలమైన బ్యాటింగ్‌తోనే బరిలోకి దిగింది. అంతర్జాతీయ మ్యాచులంటే.. అదీనూ భారత్‌పై దూకుడుగా ఆడే ట్రావిస్ హెడ్ ఫామ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్‌పై విఫలమైన అతడు అఫ్గాన్‌పై హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక మాథ్యూ షార్ట్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. కానీ, గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో ఆల్‌రౌండర్ కూపర్ కొన్నోల్లీని ఆసీస్ మేనేజ్‌మెంట్ స్క్వాడ్‌లోకి తీసుకుంది. షార్ట్‌కు బదులు ఓపెనర్‌గా జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువ. ట్రావిస్ హెడ్ మాదిరిగా దూకుడుగా ఆడే జేక్‌తో భారత బౌలింగ్‌కు ప్రమాదం తప్పదనేది క్రికెట్ విశ్లేషకుల అంచనా. మిడిలార్డర్‌లో లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కేరీ అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లు. మొన్నటివరకు ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా బ్యాట్‌ను ఝళిపించడం మొదలుపెట్టాడు. వీరంతా ఐసీసీ టోర్నీల్లో చెలరేగిపోయే బ్యాటర్లు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ క్లాస్ ఆటగాడు. అతడికి ఫామ్‌తో సంబంధం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరుగులు రాబట్టగలిగే సమర్థుడు.
భారత్ అన్ని విభాగాల్లో :
టీమ్‌ఇండియా అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లోనే ఆడేస్తోంది. తొలి రెండింట్లో భారత్ మొదట బౌలింగ్ చేసింది. లక్ష్య ఛేదనలో మన బ్యాటర్లు అదరగొట్టారు. టాప్ ఆర్డర్ రాణించడంతో అలవోకగా విజయం సాధించారు. ఇక గ్రూప్ స్టేజ్‌లో అగ్రస్థానం తేల్చిన కివీస్‌తో పోరులో మాత్రం టాప్ 3 బ్యాటర్లు త్వరగా పెవిలియన్‌కు చేరారు. దీంతో మిడిలార్డర్‌కు కఠిన పరీక్ష ఎదురైంది. ఇందులో భారత్ డిస్టింక్షన్‌లో పాసైంది. బౌలర్లకు సహకారం లభించిన దుబాయ్ పిచ్‌పై 250 పరుగుల టార్గెట్‌ను ఉంచడమంటే సాధారణ విషయం కాదు. ఇక మిగతా బాధ్యతను మాకు వదిలేయండంటూ భారత బౌలర్లు ముందుకొచ్చారు. ఆ లక్ష్యాన్ని కాపాడి అద్భుత విజయాన్ని అందించారు. ఇందులో కీలకపాత్ర నలుగురితో కూడిన స్పిన్ విభాగానిదే. స్క్వాడ్‌లో ఐదుగురిని తీసుకుని.. కివీస్‌తో మ్యాచ్‌లో నలుగురిని బరిలోకి దింపి సానుకూల ఫలితం రాబట్టిన భారత మేనేజ్‌మెంట్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటు ఫీల్డింగ్‌లోనూ చాలా మెరుగైంది. పరుగులను ఆపడమే కాకుండా.. క్యాచ్‌లను ఒడిసిపట్టి శభాష్ అనిపించారు. దుబాయ్‌లో మరోసారి ‘నలుగురు’ స్పిన్నర్లనే ప్రయోగిస్తారా? లేదా? అనేది సెమీస్ రోజు నిర్ణయించే అవకాశం ఉంది.
ఎవరు మెరుగ్గా రాణిస్తే :
మనం ఇప్పటివరకు ఫామ్, బలాల గురించి చర్చించాం. ఇక మ్యాచ్ విషయానికొచ్చేసరికి ఇవన్నీ కీలకమే కానీ ఇవే గెలిపిస్తాయని చెప్పలేం. ఆ రోజు మ్యాచ్‌లో ఎవరైతే అత్యుత్తమ ప్రదర్శన చేస్తారో వారిదే విజయం. గత వన్డే ప్రపంచకప్ ఫైనలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అప్పటివరకు వరుసగా పది మ్యాచుల్లో గెలిచి ఫైనల్‌కు వచ్చిన టీమ్‌ఇండియాను ఆసీస్ ఓడించింది. స్వదేశంలో జరిగినప్పటికీ భారత్ పరాజయం పాలైంది. కప్‌ను కోల్పోయింది. ఇప్పుడు కూడా వారి ఆటగాళ్ల ఫామ్‌ను అంచనా వేస్తూ మెరుగైన ప్రదర్శన చేస్తేనే ఆసీస్‌ను ఓడించేందుకు అవకాశం ఉంటుంది. పైన అనుకున్నట్లుగా ఐసీసీ టోర్నీలంటే పూర్తి శక్తిసామర్థ్యాలను వెచ్చించి మరీ ఆడటం ఆసీస్ ప్రత్యేకత. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవాలంటే టీమ్‌ఇండియా ముందు ఆసీస్ అనే అడ్డంకిని అధిగమించాలి