విశాఖ ఎంపీ భరత్
న్యూఢిల్లీ,న్యూస్ వన్ :
దేశ సముద్ర వాణిజ్య రంగం బలోపేతానికి అవసరమైన మార్పులకు పునరుద్ధరణగా, విశాఖపట్నం ఎంపీ భరత్ పార్లమెంట్లో "బిల్స్ ఆఫ్ లేడింగ్ బిల్లు, 2024" గురించి ప్రస్తావించారు. మారుతున్న అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులకు తగిన పటిష్టమైన చట్టపరమైన ఆధారం అందించడంలో ఈ బిల్లు కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రధాన నౌకాశ్రయాల్లో సరుకు రవాణా సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం, ప్రపంచంలో టాప్ 100 పోర్టుల్లో తొమ్మిది భారతీయ పోర్టులు చోటు దక్కించుకోవడం, తిప్పి పంపే సమయాన్ని గణనీయంగా తగ్గించడం వంటి ఎన్డీఏ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో సాధించిన విజయాలను ఆయన గుర్తుచేశారు.భారతదేశ వాణిజ్యంలో షిప్పింగ్ రంగం కీలక పాత్ర పోషిస్తున్నందున, దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు ఎంపీ శ్రీభరత్ పలు కీలక సూచనలు చేశారు.రవాణా ఖర్చులు పెరుగుతున్నాయన్న అంశాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రవాణా వ్యయాలు తగ్గితే వ్యాపార పోటీతత్వం మెరుగుపడుతుందని తెలిపారు. భారతదేశ అంతర్జాతీయ సరుకు రవాణాలో దాదాపు 95% విదేశీ నౌకలపైనే ఆధారపడుతున్నదని, ఈ పరిస్థితిని మార్చేందుకు భారీ "మదర్ షిప్స్" (Mother Ships) నిర్మాణానికి అవసరమైన షిప్‌బిల్డింగ్ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. డ్రెడ్జింగ్ సబ్సిడీతో వాణిజ్య పోటీతత్వం పెంపుదల:
భారీ నౌకలకు 18 మీటర్ల డ్రాఫ్ట్ అవసరమని, కానీ భారత పోర్టుల్లో ఎక్కువగా 14-16 మీటర్ల లోతు మాత్రమే ఉందని వివరించారు. ఇతర దేశాల లాంటి విధానాన్ని అనుసరించి, ప్రధాన నౌకాశ్రయాలకు, ముఖ్యంగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ (VPT) కు డ్రెడ్జింగ్ సబ్సిడీ ఇవ్వాలని ఆయన సూచించారు. డ్రెడ్జింగ్ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తే, భారీ నౌకలను ఆకర్షించి, ట్రాన్షిప్మెంట్ హబ్‌లుగా అభివృద్ధి చేయవచ్చని చెప్పారు.విశాఖ క్రూయిజ్ టెర్మినల్‌లో ఈ-వీసా సౌకర్యం అవసరం:₹100 కోట్లతో అభివృద్ధి చేసిన విశాఖ క్రూయిజ్ టెర్మినల్‌కు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఇతర ప్రధాన పోర్టుల్లో లభ్యమవుతున్న ఈ-వీసా సదుపాయం విశాఖ పోర్టులో లేకపోవడం ఇబ్బందిగా మారిందని, సంబంధిత మంత్రిత్వశాఖతో సమన్వయం చేసి ఈ-వీసా సౌకర్యం అందుబాటులోకి తేవాలని కోరారు.కేంద్ర ప్రభుత్వంతో సహకరించి సముద్ర వాణిజ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు. 975 కిమీ తీరరేఖ, 14 సూక్ష్మ/పెద్ద పోర్టులు ఉన్న రాష్ట్రం సముద్ర వాణిజ్యంలో అపారమైన అవకాశాలను కలిగి ఉందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సరికొత్త మారి టైం విధానాన్ని కొనియాడారు. ఈ విధానం వలన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఆధునీకరించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో కీలక కేంద్రముగా మార్చడమే లక్ష్యంగా ఉందని ఎంపీ శ్రీభరత్ అభిప్రాయపడ్డారు.