
హోంమంత్రి వంగలపూడి అనిత
అమరావతి, ఫిబ్రవరి, 15, (న్యూస్ వన్ ప్రతినిధి) ఉయ్యాలలో ఉన్న పసిపాపలపై అత్యాచారాలు చాలా దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత వెల్లడించారు. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న తీరు ఆందోళనకరమన్నారు. విజయవాడలోని జీఆర్టీ హోటల్ వేదికగా జరిగిన డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో హోంమంత్రి అనిత ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజల నమ్మకాన్ని..ప్రభుత్వ ప్రతిష్ఠను నిలబెట్టేలా పని చేయాలని హోంమంత్రి స్పష్టం చేశారు.న్యాయవాదులందరినీ ఒకచోట చేర్చి సదస్సు నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. పోలీస్,న్యాయవ్యవస్థల్లో మహిళా సాధికారత పెరుగుతుండడం శుభపరిణామమన్నారు. పోలీస్, ప్రాసిక్యూటర్ల సమన్వయంతోనే సత్వర న్యాయం సాధ్యమవుతుందన్నారు. సర్వం కోల్పోయి వచ్చిన వారికి అండగా నిలబడాలని హోంమంత్రి పిలుపునిచ్చారు.ప్రతి వ్యక్తి తనకు తాను నిఘా పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి సమాజంలో ఏర్పడిందని హోంమంత్రి పేర్కొన్నారు.దొంగలు చాలా తెలివి మీరిపోయారన్నారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు చాలా అవసరమన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని నేరాలను నియంత్రించాలన్నారు. ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోలీసు, న్యాయవ్యవస్థ సమన్వయంతో చాలా కేసులు ఛేదించొచ్చన్నారు. ఛార్జ్ షీట్, ఎఫ్ఐఆర్ నమోదైన నాటి నుంచి నిందితులకు శిక్షపడే వరకూ ప్రాసిక్యూషన్ పకడ్బంధీగా వ్యవహరించాలన్నారు. విజయనగరం జిల్లాలో రెండు కేసుల్లో నిందితులకు 6నెలలోపే శిక్ష వేయించగలిగామన్నారు. పోలీస్, న్యాయవ్యవస్థకు అవసరమైన వనరులు, వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. వాస్తవ పరిస్థితి తెలుసుకోవడం కోసం ప్రోటోకాల్ లేకుండా ట్రాఫిక్ లో ప్రయాణించి ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు హోంమంత్రి తెలిపారు. అనంతపురంలో ప్రియుడు తన నంబర్ ని బ్లాక్ చేశాడని ఎస్పీకి ఫిర్యాదు చేసిన సంఘటనను ఆమె ప్రస్తావించారు. ఏ కష్టం కలిగినా కాపాడేది పోలీసులే అన్న ప్రజల అభిప్రాయాలను అర్థం చేసుకుని ముందుకెళ్లాలన్నారు. ఫాస్ట్ ట్రాక్, ప్రత్యేక కోర్టులు, పోస్కో కోర్టులు ఎన్నో ఉన్నాయి. తొందరగా న్యాయం చేయడమే అసలైన న్యాయమన్నారు.