Thursday, March 13, 2025
spot_img
Homeఅంతర్జాతీయ-వార్తలుఫైనల్స్ లో …గెలిచేదెవరో..!

ఫైనల్స్ లో …గెలిచేదెవరో..!

- ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మార్చ్ 9న దుబాయ్ లో 

- ఫైనల్ లో భారత జట్టుతో తలపడబోతున్న న్యూజిలాండ్ 

 - వాళ్ళని కట్టడి చెయకపోతే  రోహిత్‌ సేనకు ఇబ్బందులే 

 - రెండు జట్లను భయపెడుతున్న ఆటగాళ్ల బలహీనతలు

( న్యూస్ వన్ బ్యూరో )
భారత్ – న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగనుంది. దుబాయ్ లో జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ లో బలాబలాలు, బలహీనతలు రెండు జట్లను భయపెడుతున్నాయి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్ మంచి ప్రతిభను కనపర్చాయి. భారత్ ఇప్పటి వరకూ లీగ్ మ్యాచ్ లో కానీ, సెమీ ఫైనల్స్ లో గాని వరస విజయాలతో దూసుకు వచ్చింది. న్యూజిలాండ్ అయితే భారత్ తో తప్పించి ఆడిన అన్ని మ్యాచ్ లలోనూ గెలిచింది. అంతేకాదు భారీ స్కోరు సాధించింది. పాకిస్థాన్, సౌతాఫ్రికా మీద భారీ స్కోరు చేయడంతో ఈ జట్టు బ్యాటింగ్ పరిస్థితి ఎవరికీ వేరే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే బ్యాటింగ్ పరంగా అది బలమైన జట్టుగానే భావించాలి. అయితే న్యూజిలాండ్ బౌలింగ్ పరంగా కొంత బలహీనంగా ఉందని చెప్పాలి.అద్భుతమైన విజయాలతో 2000 సంవత్సరంలో ఫైనల్‌కు దూసుకొచ్చిన భారత్ జట్టు ఊపు చూస్తే ట్రోఫీ గెలవడం ఖాయంగా కనిపించింది. కానీ, తుదిపోరులో అంతా తలకిందులైపోయింది. కప్పును న్యూజిలాండ్‌ టీమ్ ఎగరేసుకుపోయింది. మరోసారి, రోహిత్ సేనకు కప్‌ కొట్టకుండా ఇద్దరు కివీస్ ప్లేయర్లు అడ్డుపడేలా కనిపిస్తున్నారు. ఆ ఇద్దరు ఎవరో కాదు కేన్‌ విలియమ్సన్, రచిన్‌ రవీంద్ర.. వీరు ఫైనల్లో చెలరేగిపోతే న్యూజిలాండ్ ను ఆపడం భారత వల్ల కాదు. కాబట్టి తొందరగా వీరిని పెవిలియన్ కి పంపించేలా టీమిండియా ప్లాన్ చేసుకోవాలి. అయితే, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ విలువైన ఇన్నింగ్స్‌లు ఆడే వ్యక్తి కేన్ విలియమ్సన్. ఏమాత్రం ఒత్తిడికి లోనూ కాకుండా.. కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అతడి బ్యాటింగ్‌తో మిడిలార్డర్‌లో ఉన్న డరిల్‌ మిచెల్, గ్లెన్‌ ఫిలిప్స్‌కు పని తేలికైపోతుంది. ఇప్పటి వరకు, కేన్ మామ 4 మ్యాచ్‌ల్లో 189 పరుగులు కొట్టగా.. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అయితే, కేవలం బ్యాటింగ్‌లో మాత్రమే కాదు అటు ఫీల్డింగ్‌లోనూ అతడు అదరగొడుతున్నాడు. భారత్‌తో మ్యాచ్‌లో రెండు మెరుపు క్యాచ్‌లు పట్టి అందర్ని అశ్చర్యానికి గురి చేశాడు. కెప్టెన్‌గా తన అనుభవాన్ని ప్రస్తుత సారథి మిచెల్‌ శాంట్నర్‌కు పంచుతూ టీమ్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు కేన్ విలియమ్సన్. ఇక, ఛాంపియన్స్‌ ట్రోఫీలో న్యూజిలాండ్‌కు ప్రధాన ఆయుధంగా మారాడు రచిన్ రవీంద్ర. ఈ టోర్నీలో మరో ఓపెనర్‌ విల్‌ యంగ్‌ పెద్దగా రాణించకపోవడంతో కివీస్‌ భారీ స్కోర్లు చేసిందంటే అది కేవలం రచిన్‌ స్థిరతమైన బ్యాటింగ్ అని చెప్పాలి. స్పిన్, పేస్‌ను దీటుగా ఎదుర్కొంటూ రన్స్ సాధిస్తున్నాడు ఈ లెఫ్ట్‌హ్యాండర్‌.. బంతిని గాల్లోకి లేపకుండా ఎక్కువగా గ్రౌండ్‌ షాట్లతోనే భారీగా పరుగులు రాబట్టడం ఇతడి శైలి. భారత్‌తో ఫైనల్లోనూ కివీస్‌ రచిన్ పైనే ఎక్కువగా ఆధారపడనుంది. స్టార్టింగ్ లో అతడు మంచి ఆరంభం ఇస్తే తర్వాత సంగతి మిగతా బ్యాటర్లు చూసుకుంటారనేది న్యూజిలాండ్ ప్లాన్ చేస్తుంది. కాగా, ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. కాగా, అద్భుత ఫామ్‌లో ఉన్న కేన్ విలియమ్సన్‌, రచిన్ రవీంద్ర భారత్‌తో జరిగే ఫైనల్ పోరులో ఎలా రాణిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరిలో ఏ ఒకరు కుదురుకున్నా రోహిత్‌ సేనకు ఇబ్బందులు తప్పవు అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. దుబాయ్‌లోనే అన్ని మ్యాచ్‌లు ఆడడంతో భారత్ కు సానుకూలాంశం అని చెప్పాలి. ఇక, ట్రోఫీలో చివరి లీగ్‌ మ్యాచ్ లో భారత్‌ చేతిలో ఓడిపోవడంతో శాంటర్న్ సేన కసి మీద ఉంది. ఈ నేపథ్యంలో రచిన్, కేన్‌తో పాటు మిగిలిన జట్టు కూడా ఫైనల్‌ను అంత తేలిగ్గా వదిలే ఛాన్స్ లేదు.. తటస్థ వేదికల్లో రెండు జట్లు 32 వన్డేల్లో పోటీ పడగా భారత్‌-కివీస్‌ చెరో 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.

ఓపెనర్లుగా వచ్చి :

ఇక భారత్ విషయానికి వస్తే ఓపెనర్లు నిలకడగా ఆడాల్సి ఉంది. శుభమన్ గిల్ ఒక్క మ్యాచ్ లో తప్పించి అన్నింటా త్వరగా అవుటయ్యాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఒకే ఒక మ్యాచ్ లో పరవాలేదనిపించినా మిగిలిన అన్ని మ్యాచ్ లలో విఫలమయ్యాడు. విరాట్ కోహ్లి ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ చేసి పరవాలేదనిపించాడు. మరొక సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ సెమీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియాపై మంచి పరుగులు సాధించి భారత్ జట్టు విజయానికి కారణమయ్యాడు. ఓపెనర్లతో పాటు సీనియర్ ఆటగాళ్లు వరసగా ఇబ్బందులు పడుతూ అవుట్ అవుతుండటంతో తర్వాత వచ్చే వారిపై వత్తిడి అధికంగా ఉంది. అయినా అదృష్టం మనవైపు ఉండి మ్యాచ్ లన్నీ గెలిచాం.

ఫీల్డింగ్ విషయంలో :

మరో ముఖ్యమైన విషయం … న్యూజిలాండ్ ఫీల్డింగ్ ను ఎంత అభినందించినా తక్కువే. దాదాపు అందరూ ఆటగాళ్లు కష్టమైన క్యాచ్ లను కూడా పట్టేసి ప్రత్యర్థిని పెవిలియన్ బాట పట్టిస్తున్నారు. కేన్ మామ, ఫిలిప్స్ ల గురించి సోషల్ మీడియాలో ఒకటే ప్రశంసలు. బౌండరీకి వెళ్లకుండా ఆ జట్టు మొత్తం శ్రమించే తీరు క్రికెట్ ఫ్యాన్స్ ను అబ్బుర పర్చే విధంగా ఉంది. కానీ భారత్ జట్టు ఫీల్డింగ్ లో కొంత వెనకబడి ఉందనే చెప్పాలి. క్యాచ్ లను చేజార్చడం, బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపలేక ఆపసోపాలు పడటం మనోళ్లకు అలవాటుగా మారింది. ఓపెనర్లు నిలదొక్కుకుని, ఫీల్డింగ్ పై భారత్ ఆటగాళ్లు శ్రద్ధ పెడితే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ మనదవుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments