
జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్
విజయనగరం సిటీ (మార్చి 04) న్యూస్ వన్ ప్రతినిధి :-
ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 8న నిర్వహించే మహిళా దినోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. ఆ రోజున వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా పెద్ద ఎత్తున మహిళలకు లబ్ది చేకూర్చే పథకాలను పంపిణీ చేయాలని సూచించారు. మహిళా దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ తమ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయా శాఖల ద్వారా చేయబోయే సంక్షేమ కార్యక్రమాలపై ఆరా తీశారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సుమారు 4 వేల మంది మహిళలతో రాజీవ్ స్టేడియంలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ఎంపిక చేసిన సుమారు వెయ్యి మందికి ఎన్ఏటిఎస్ శిక్షణా కార్యక్రమాన్ని మార్చి 8న ప్రారంభించాలని సూచించారు. డిఆర్‌డిఏ ద్వారా సుమారు రూ.121 కోట్లు, మెప్మా ద్వారా రూ.20 కోట్లు విలువైన బ్యాంకు లింకేజీని అందజేయాలని చెప్పారు. మెప్మా ద్వారా 100 జీవనోపాది యూనిట్ల పంపిణీకి చేర్పాట్లు చేయాలన్నారు. వివిధ రంగాల్లో ప్రసిద్ది చెందిన నలుగురు మహిళలను సన్మానించేందుకు ఏర్పాటు చేయాలని చెప్పారు. 50 ఎంఎస్ఎంఈ యూనిట్లను గ్రౌండింగ్ చేయనున్నట్లు చెప్పారు. పిఎం విశ్వకర్మ పథకం క్రింద 97 యూనిట్లను, 150 మందికి నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని, స్టాండప్ ఇండియా క్రింద 50 మందికి, ముద్ర క్రింద 150 మందికి రుణాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో డిఆర్‌డిఏ పిడి ఎ.కల్యాణచక్రవర్తి, మెప్మా పిడి సత్తిరాజు, ఎల్‌డిఎం మూర్తి, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ జీవనరాణి, ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు.