
క్షేమంగా బయటపడ్డ మత్స్యకారులు
ముంబయి : మహారాష్ట్రలోని అలిబాగ్ సముద్ర తీరానికి సమీపంలో ఓ మత్స్యకారుల బోటుకు అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో అక్కడ భయానక పరిస్థితి ఏర్పడింది. ఈ బోటులో 18 నుండి 20 మంది మత్స్యకారులు ఉన్నారని సమాచారం. అయితే, అందులోని మత్స్యకారులందరు సురక్షితంగా బయటపడ్డారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. నేడు ఉదయం అలిబాగ్ సమీప సముద్రంలో ఓ మత్స్యకారుల బోటుకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. సమీపంలోని మత్స్యకారులు మంటలను గమనించి సహాయానికి వచ్చారు. కానీ మంటలు వేగంగా వ్యాపించడంతో కొద్ది సేపటిలోనే బోటు 80% వరకు పూర్తిగా కాలిపోయింది. ఈ అగ్ని ప్రమాదంలో బోటుపై ఉన్న వేట కోసం ఉపయోగించే సరఫరా సామాగ్రి కూడా పూర్తిగా ధ్వంసమైంది.మంటలు చెలరేగిన వెంటనే మత్స్యకారులందరు సముద్రంలో దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. స్థానిక మత్స్యకారులు వెంటనే స్పందించి, పడవల ద్వారా వారిని కాపాడి సముద్ర తీరానికి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం తీవ్రంగా ఉన్నప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం కొంత ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. ఈ బోటు సఖర్ గ్రామానికి చెందిన రాకేష్ మారుతీ గణ్ అనే మత్స్యకారుడిదని అధికారులు గుర్తించారు. ఆయన ఇటీవల తన బోటును మరమ్మతులు చేయించినట్లు సమాచారం. అయితే, మరమ్మతుల తర్వాతే ఈ ప్రమాదం జరగడంతో దీనికి అసలు కారణం ఏమిటనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని మత్స్యకారులు అప్రమత్తంగా స్పందించారు. వారు తమ పడవలతో సహాయానికి చేరుకొని, మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. చివరకు మంటలను ఆర్పివేసి, బోటును సముద్ర తీరానికి తరలించారు. అయితే, ఈ అగ్ని ప్రమాదానికి అసలు కారణం ఇంకా తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ అనేది ఒక ప్రధాన అనుమానం అయినప్పటికీ, పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించిన తర్వాతే స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు. స్థానిక పోలీసులు, మత్స్యకార శాఖ దీనిపై విచారణ చేపట్టారు