
అక్రమ వలసదారులను తిరిగి పంపించే కార్యక్రమంలో భాగంగా అమెరికా మరో రెండు విమానాల్లో భారతీయులను భారత్ కు పంపనుంది. తొలి విమానం 119 మందితో శనివారం రాత్రి 10 గంటలకు అమృత్‌సర్ లో దిగనుంది. రెండో విమానం ఆదివారం ల్యాండయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విమానంలో ఎంత మందిని పంపించనున్నారన్న విషయం వెల్లడి కాలేదు. తొలి విమానంలో రానున్న 119 మంది భారత వలసదారుల్లో 67 మంది పంజాబ్ కు చెందినవారు. మిగతవా వారు హరియాణా (33), గుజరాత్ (8), ఉత్తర్‌ప్రదేశ్ (3), గోవా (2), మహారాష్ట్ర (2), రాజస్థాన్ (2), హిమాచల్ ప్రదేశ్ ( 1), జమ్మూకశ్మీర్ (1) వాసులు. గతవారం సైనిక విమానంలో అమెరికా 104 మంది అక్రమ వలసదారులను పంపిన సంగతి తెలిసిందే.