
(క్రైమ్ బ్యూరో )
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో తన నివాసంలో ఉండగా ఏపీ పోలీసులు ఇవాళ ఉదయం అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగురోడ్డు మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు. పలు కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నాడు. ఏపీలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీని ఏ71గా పోలీసులు చేర్చారు. బాపులపాడు మండలం ఆరుగొలనులో టీడీపీ నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో వంశీ ఏ2గా ఉన్నాడు. అదేవిధంగా ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్న కేసు, గన్నవరం మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో నకిలీ ఈ పట్టాల కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నాడు. అయితే, ప్రస్తుతం పోలీసులు వల్లభనేని వంశీని ఎస్సీఎస్టీ, అత్యాచార నిరోధక కేసులో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో వంశీతోపాటు 88మందిపై కేసు నమోదైంది. ఈ కేసులోని చాలా మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో కొందరు రిమాండ్ లో ఉండగా.. మరికొందరు బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీ అని.. అతన్ని ఏ క్షణమైనా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే, వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అపీల్ చేశారు. ఈనెల 20వ తేదీన వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు, తనకు ఎలాంటి సంబందం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చి ట్విస్ట్ ఇచ్చాడు.సత్యవర్ధన్ కేసు వెనక్కి తీసుకోవటానికి కారణం ఏమిటని పోలీసులు ఆరాతీయగా.. వంశీ, ఆయన అనుచరులు బెదిరించడంతోనే తాను కేసును వెనక్కి తీసుకున్నట్లు సత్యవర్ధన్ పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సత్యవర్ధన్ స్టేట్ మెంట్ ఆధారంగా విజయవాడ పటమట పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. వంశీ ఇంటికి నోటీసులు అంటించారు. బీఎన్ఎస్ సెక్షన్ల 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కూడా కేసులు నమోదు చేశారు.