• 119 కేంద్రాల్లో హాజరు కానున్న 23,765 మంది విద్యార్ధులు
• 144 సెక్షన్ అమలు జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్
రాజు (విజయనగరం సిటీ, న్యూస్ వన్ ప్రతినిధి)
మార్చి 17 నుండి 31 వరకు 10 వ తరగతి రెగ్యులర్ వారికీ , 17 నుండి మార్చ్ 28 వరకు ఓపెన్ స్కూల్స్ విద్యార్ధులకు 10 వ తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుండి 12.45 వరకు జరుగుతాయని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. రెగ్యులర్, ప్రైవేటు కలిపి జిల్లాలో 119 కేంద్రాల్లో 23,765 మంది విద్యార్ధులు హాజరు కానున్నారని తెలిపారు. ఓపెన్ స్కూల్స్ నుండి రెగ్యులర్ 460 , ప్రైవేటు 154 మొత్తం 614 విద్యార్ధులకు గానూ 27 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పరీక్షలు కట్టుదిట్టంగా, ఎక్కడా కాపీ జరగకుండా నిర్వహించాలని తెలిపారు. పది పరీక్షల పై కలెక్టర్ ఛాంబర్ లో ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ ను, డిపార్ట్మెంటల్ అధికారిని నియమించాలని, 7 ఫ్లయింగ్ స్కాడ్ లను ఏర్పాటు చేయాలనీ సూచించారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జెరాక్ష్, కేంద్రాలను, నెట్ సెంటర్లను మూసి వేయాలని తెలిపారు. ప్రశ్నా పత్రాలను నిల్వ ఉంచుటకు గానూ విజయనగరం, గజపతినగరం చీపురుపల్లి, ఎస్.కోట పోలీస్ స్టేషన్లలో కస్టడీ ఏర్పాట్లను చేయాలన్నారు. జిల్లా స్థాయి లో ఒక స్ట్రాంగ్ రూమ్ డి.ఆర్.ఓ ఆధ్వర్యం లో ఉండాలని తెలిపారు. 9 రూట్ లను ఏర్పాటు చేసి ఈ.ఓ.పి.ఆర్.డి లేదా డిప్యూటీ తహసిల్దార్ లను రూట్ ఆఫీసర్లు గా నియమించాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ అధికారులకు, తాగు నీరు, పారిశుధ్యం ఏర్పాటు చేయాలనీ మున్సిపల్ కమీషనర్లకు, డి.పి.ఓ కు ఆదేశించారు. విద్యార్ధులకు ఇబ్బంది కలగకుండా పరీక్షల సమయంలో అవసరమగు బస్సులను నడపాలని ఆర్.టి.సి వారికీ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపు లను నిర్వహించి అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని డి.ఎం.హెచ్.ఓ కు సూచించారు. పరీక్షల పర్యవేక్షణ కు మండల స్థాయి లో నున్న గజెటెడ్ అధికారులను వేయాలని, అన్ని కేంద్రాలను ప్రతి రోజు సందర్శించి, ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా ప్రతి ఒక్కరూ చూడాలని ఆదేశించారు.
ఈ సమావేశం లో డి.ఆర్.ఓ శ్రీనివాస మూర్తి, డి.ఈ.ఓ మాణిక్యం నాయుడు, డి.ఎం.హెచ్.ఓ డా. జీవన రాణి, ఆర్.టి.సి, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు, ఆర్.ఐ.ఓ , పోస్టల్ శాఖల అధికారులు పాల్గొన్నారు