
హైదరాబాద్,న్యూస్ వన్ ప్రతినిధి :
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ‘రైతు భరోసా’ పథకం కింద రెండెకరాల లోపు సాగుభూములున్న రైతుల ఖాతాల్లో నగదును జమ చేసింది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రతీయేటా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.12వేలను రెండు దఫాలుగా అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలి విడత రూ.6వేలను దశలవారిగా రేవంత్ సర్కార్ రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పటికే ఎకరం లోపు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. తాజాగా.. రెండెకరాల లోపు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు విడుదల చేసింది.రెండెకరాల లోపు సాగుభూములున్న 13.24లక్షల మంది రైతుల ఖాతాల్లో సోమవారం ప్రభుత్వం నగదు జమ చేసింది. మొత్తం 18.19 లక్షల ఎకరాల విస్తీర్ణంలోని భూములకుగాను రూ.1,092 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో ఇప్పటి వరకు మూడు విడతల్లో 36.97లక్షల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి 34.69లక్షల మంది రైతులకు రూ.2,218.49 కోట్లను రేవంత్ సర్కార్ విడుదల చేసింది. మూడు దఫాలుగా విడుదలైన రైతు భరోసా కింద సిద్ధిపేట జిల్లా రైతులు అత్యధిక సంఖ్యలో లబ్ధిపొందారు. ఈ జిల్లాలో 1,86,241 మంది రైతుల ఖాతాల్లోకి రూ.116.26కోట్లను ప్రభుత్వం జమ చేసింది.రాష్ట్రంలో సాగుయోగ్యమైన వ్యవసాయ భూములకు రైతు భరోసా నిధులు అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే, దశల వారిగా మార్చి 31వ తేదీ వరకు ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. మరుసటి రోజే ఎంపిక చేసిన 577 గ్రామ పంచాయతీలకు చెందిన 4,41,911 మంది రైతులకు చెందిన 9.48లక్షల ఎకరాలకు రూ.569కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తరువాత ఎకరం లోపు విస్తీర్ణం కలిగిన 17.03లక్షల మంది రైతులకు రూ.557 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా.. మూడో విడత కింద రెండెకరాల లోపు సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.1,092 కోట్ల నిధులు జమ చేసింది. రెండెకరాలు పైబడిన సాగుభూములకు సంబంధించి త్వరలో దశలవారిగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది.తెలంగాణ ప్రభుత్వం సాగుయోగ్యమైన భూమికి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తున్న విషయం తెలిసిందే. దశల వారిగా ఎకరం, రెండు ఎకరాలు, 2.5ఎకరాలు, మూడు ఎకరాలు.. ఇలా.. అర్హత కలిగిన అందరి రైతు ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. ఇందుకోసం ఈ-కుబేర్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ డబ్బులు జమ కాకపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీ భూమి వివరాలు, సాగు చేస్తున్న పంట, పట్టాదారు పాసు పుస్తకాలు వంటి వివరాలతో వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. అక్కడ అంతా కరెక్టుగా ఉంటే తరువాత బ్యాంక్ వద్దకు వెళ్లి మీ అకౌంట్ వివరాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్, IFSC కోడ్ సరిగా ఇచ్చారో లేదో చూసుకోవాలి. బ్యాంక్ ఖాతా యాక్టివ్ గా ఉందో లేదో చూసుకోవాలి. ఏవైనా సమస్యలు ఉంటే సరిచేసుకొని సంబంధిత పత్రాలను కస్టర్ వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓ)కి ఇవ్వాల్సి ఉంటుంది.