
విజయనగరం సిటీ ( మార్చి 04 ) న్యూస్ వన్ ప్రతినిధి :
జిల్లాలోని ద్విచక్ర వాహన చోదకులంతా వాహనం నడిపేటపుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఉప రవాణా కమిషనర్ డి.మణికుమార్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మంగళవారం రవాణాశాఖ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించి హెల్మెట్ ధరించని 30 మంది వాహన చోదకులను గుర్తించడం జరిగిందన్నారు. వీరందరికీ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. తమ కుటుంబం కోసం, ఏదైనా ప్రమాదం సంభవించినపుడు ప్రాణాలను కాపాడుకోవడం కోసం హెల్మెట్ ధరించడం అవసరమని వారికి అవగాహన కల్పించారు. వచ్చే వారం రోజులపాటు జిల్లాలో హెల్మెట్ ధారణపై తనిఖీలు కొనసాగిస్తామని ఉపరవాణా కమిషనర్ చెప్పారు.