దామోదర్ గోవింద్ ( ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ )
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి రాష్ట్రం లోని ఇతర ముఖ్యమైన కార్పొరేషన్ లు, జిల్లా పరిషత్ లపై దృష్టి సారించింది.ఈ క్రమంలోనే మహా విశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గంపై కూటమిలోని తెదేపా నాయకుల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం వైకాపాకు ఎంతమంది కార్పొరేటర్లున్నారు ? తెదేపా తరఫున ఎంతమంది ప్రాతినిథ్యం వహిస్తున్నారు? జనసేన, భాజపా జతైతే మేయర్ పదవి దక్కించుకోవటానికి ఇంకా ఎంతమంది అవసరమన్న లెక్కలు వేస్తున్నారు. జీవీఎంసీలో వైకాపాకు తిరుగులేని మెజారిటీ ఉన్నా ప్రభుత్వం మారటంతో కార్పొరేటర్లు వైకాపాలోనే ఉంటారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జీవీఎంసీలో 98 స్థానాలకుగాను ప్రస్తుతం 97 మంది కార్పొరేటర్లున్నారు. తెదేపాకు 29, జనసేనకు ముగ్గురు, భాజపా, సీపీఎం, సీపీఐలకు ఒక్కొక్కరు, ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లున్నారు. మిగతా 57 మంది వైకాపా కార్పొరేటర్లే. జీవీఎంసీ పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. అనకాపల్లి జిల్లా తెదేపా ప్రజాప్రతినిధులు జీవీఎంసీకి ప్రాతినిధ్యం వహిస్తామని ఎంపిక చేసుకుంటే మరో ఎమ్మెల్యే, ఎంపీ పెరుగుతారు. వారిద్దరూ జిల్లా పరిషత్తుకు వెళతామంటే వారికి జీవీఎంసీలో ప్రాతినిధ్యం ఉండదు. వీరితోపాటు ఇద్దరు తెదేపా ఎమ్మెల్సీలున్నారు. వైకాపాకు పండుల రవీంద్రబాబు, వరుదు కల్యాణి (ఎమ్మెల్సీలు) మద్దతివ్వనున్నారు. తెదేపాకు జనసేన భాజపా, స్వతంత్ర కార్పొరేటర్లు మద్దతిస్తే 40 మంది కార్పొరేటర్లవుతారు. శాసనసభ్యులు, ఎంపీలు కలిసి పదిమంది మద్దతిస్తే తెదేపా మేయర్ అభ్యర్థికి 51 ఓట్లు వస్తాయి. వైకాపాలో అసంతృప్తితో పలువురు కార్పొరేటర్లను తీసుకుంటే మేయర్ పీఠాన్ని తెదేపా కైవసం చేసుకోవచ్చని చర్చ సాగుతోంది.
ఈ క్రమంలోనే విశాఖ యాదవ సంఘం నాయకులు పత్రిక సమావేశంను సోమవారం ఉదయం ఎన్.ఏ.డి కుడలిలో ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా విశాఖ జిల్లా యాదవ సంఘం నాయకులు ఎడ్ల గోపాలకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం ఏర్పాటు అయిన నుండి ప్రస్తుత ప్రభుత్వంలో స్థానిక ప్రజా ప్రతినిదులుగా కొనసాగుతున్న మేయర్,చైర్మన్, వైస్ చైర్మన్ లను మార్చివేసి కూటమి ప్రభుత్వంకు చెందిన వారిని ఎంపిక చేసుకోవాలని నిర్ణయం తీసుకొని బలవంతంగా, దౌర్జన్యంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ను నియమించడం జరిగిందని తెలిపారు. అదే మాదిరిగా విశాఖ నగర్ మేయర్ ను మార్చాలని నిర్ణయం తీసుకుంటే యాదవ సంఘాల ప్రజలు వ్యతిరేకిస్తునమని ఈ సందర్భంగా తెలిపారు. గత ప్రభుత్వం వైయస్సార్సీపి పార్టీలో బీసీ యాదవ మహిళ మేయర్ ను ఎంపిక చేసి నాలుగు సంవత్సరాల కాల పరిమితిలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అయితే ఇంకొక్క సంవత్సర కాలంలో స్థానిక ఎన్నికలు ఉన్నందున ఇతరుణంలో ప్రస్తుత మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ని మార్చాలనుకోవడం మంచి నిర్ణయం కాదని తెలిపారు. కాని పక్షాన తొలగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే విశాఖలో యాదవులలో ఒకరిని ఎంపిక చేయాలని కాని పక్షాన వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి చుక్కెదురు తప్పనిసరి అని, పెద్ద ఎత్తున ధర్నాలు,ఉద్యమాలు కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా యాదవ సంఘాల నాయకులు హెచ్చరించారు