
హైదరాబాద్,న్యూస్ వన్ ప్రతినిధి :
నరాలు తెగే ఉత్కంఠ భరితమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం సాధించిందని దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవడం మాములే. ఇందులో భాగంగానే తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది. దీనితో 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని మళ్లీ భారత జట్టు ముద్దాడింది. ఈ సందర్బాన్ని దేశవ్యాప్తంగా పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు జాతీయ జట్టు విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. భారత్ జట్టు విజయం సాధించిన అనంతరం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో పలుచోట్ల క్రికెట్ అభిమానులు రోడ్ల మీదకు వచ్చి బాణాసంచా కాల్చారు. అయితే, క్రికెట్ ప్రియుల ఆనందోత్సాహాన్ని పోలీసులు అడ్డుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అనంతరం హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. అయితే, పోలీసులు అభిమానులను చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేయడం తీవ్ర విమర్శలకు గురైంది. క్రికెట్ ప్రేమికులు దేశంపై తమకు ఉన్న ప్రేమను, జాతీయ జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంటే పోలీసుల లాఠీఛార్జ్ సరికాదని వారు అసహనం వ్యక్తం చేశారు. కాకపోతే, పోలీసులు మాత్రం వాహనదారులకు ఇబ్బంది కలగకుండా.. రాత్రి సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అభిమానులను పంపించేందుకు మాత్రమే ప్రయత్నించినట్లు పేర్కొన్నారు.భారత్ విజయం అనంతరం అభిమానుల సంబరాలను అడ్డుకోవడంపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానులు జాతీయ జెండాలు పట్టుకుని రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే.. వారిపై లాఠీఛార్జ్ చేయడం సరికాదన్నారు. ఇంతకంటే చెత్త పరిస్థితి ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. పోలీసుల చర్యలను ఖండిస్తూ.. ఇది నిజంగా సిగ్గుచేటు అని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా స్పందించారు. భారత జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న అభిమానులను పోలీసులు లాఠీచార్జ్ చేస్తూ, వారిని ఉరికించి కొడుతున్న వీడియోను ఆయన షేర్ చేశారు.