
రాజు (విజయనగరంన్యూస్ వన్ ప్రతినిధి)
ఆన్ లైన్ సేవలపై తగిన పరిజ్ఞానంతో అప్రమత్తంగా వుండటం ద్వారా మాత్రమే సైబర్ మోసాలకు గురికాకుండా సురక్షితంగా వుండగలమని జిల్లా సూచన విజ్ఞాన అధికారి(డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేటిక్స్ అధికారి) ఆర్.నరేంద్ర అన్నారు. ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలోని జాతీయ సూచన విజ్ఞాన కేంద్రం(నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో మంగళవారం సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం నిర్వహించారు. ప్రతి ఏటా ఫిబ్రవరి రెండో మంగళవారం సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవంగా(ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్) ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులు, ప్రభుత్వ ఉద్యోగులకు అంతర్జాల సేవలను సురక్షితంగా ఎలా వినియోగించాలనే అంశంపై అవగాహన కల్పించారు. డిజిటల్ గుర్తింపును గానీ, వ్యక్తిగత సమాచారాన్ని అనధికారిక వెబ్సైట్లలో షేర్ చేయరాదని, ఒన్‌టైమ్ పాస్‌వర్డు సమాచారాన్ని ఇతరులతో పంచుకోరాదని చెప్పారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా లభించే వైఫై వినియోగంచడం వల్ల మన వ్యక్తిగత సమాచారం తస్కరించే ప్రమాదం వుందని తెలిపారు. తెలియని ఫోన్ నెంబర్ల నుంచి వీడియోకాల్స్ వచ్చినపుడు స్పందించరాదని చెప్పారు.ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు డిజిటల్ సేవలపై అవగాహన పెంచుకుంటూ సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు, సిపిఓ పి.బాలాజీ, జె.ఎన్.టి.యు. అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీకాంత్, ఇన్ఫర్మేటిక్స్ అధికారి ఏ.బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.