
- అసెంబ్లీలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
- బడ్జెట్ లో బీసీలకు అత్యధిక నిధుల కేటాయింపు
- బీసీలకు టీడీపీతోనే రాజకీయ ప్రాధాన్యం
- త్వరలో ఆర్యవైశ్య, క్షత్రియ, కమ్మ, రెడ్డి కో ఆపరేటి క్రెడిట్ సొసైటీల ఏర్పాటు
- హాస్టళ్ల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం
- బీసీలను మోసగించిన జగన్
- 3 ఎమ్మెల్సీ పదవులు బడుగులకే కేటాయింపుపై మంత్రి సవిత హర్షం
అమరావతి,న్యూస్ వన్ ప్రతినిధి :
బీసీలే శ్వాస… వారి సంక్షేమమే ధ్యాస… వారి అభివృద్ధే ఆశ… ఇదే చంద్రబాబునాయుడు గారి అభిలాష అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. సోమవారం బడ్జెట్ పై చర్చ సందర్బంగా అసెంబ్లీలో మంత్రి సవిత మాట్లాడారు. తమది బీసీల పక్షపాతి ప్రభుత్వమన్నారు. బీసీల అభివృద్ధికి కోసం గతంలో ఎన్నడూలేనంతగా ప్రస్తుత బడ్జెట్ లో అత్యధికంగా రూ.33,878.45 కోట్ల నిధులు కేటాయించినందుకు సీఎం చంద్రబాబునాయుడికి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు ధన్యవాదాలు తెలిపారు. చేపలు ఇవ్వడం కాదు…చేపలు ఎలా పట్టాలో నేర్పాలన్నది సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమన్నారు. దీనిలో భాగంగానే బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం ఆర్థిక సాయమందిస్తున్నామన్నారు. స్వయం ఉపాధి పథకాల అమలు చేస్తున్నామన్నారు. మినీ డెయిరీలు, గొర్రెలు, మేకల పెంపకం యూనిట్లు, జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓబీఎంఎంఎస్ ద్వారా మేదర, కుమ్మరి/శాలివాహన కుల వృత్తులకు చెందిన వారికి ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. సముద్రంలో చేపల వేట విరామ సమయంలో రూ.20,000 లు ఆర్థిక సహాయం అందజేయబోతున్నామన్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.
బీసీలకు టీడీపీతోనే రాజకీయ ప్రాధాన్యం…
సమాజానికి బీసీలు వెన్నెముకలాంటి వారని సీఎం చంద్రబాబునాయుడు భావన అని అన్నారు. వెనుకబడిన తరగతులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేస్తూ, పెద్దపీట వేస్తున్నారన్నారు. తన కేబినెట్ 8 మంది బీసీలను మంత్రులుగా నియమించారన్నారు. సీఎస్ సహా పలు కీలక పోస్టుల్లోనూ బీసీలకు ప్రాధాన్యమిచ్చారన్నారు. చట్టసభలలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రప్రభుత్వ తదుపరి చర్యకు సిఫార్సు చేశామన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
బీసీ బిడ్డల విద్యకు ప్రాధాన్యం
బీసీ బిడ్డల విద్య కోసం అధిక ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేశామన్నారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడానికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి సన్న బియ్యం వినియోగించనున్నామన్నారు. బీసీ హాస్టళ్లలో ఎస్ఆర్ శంకరన్ రిసోర్సు సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. గతేడాది 25 ఎంజేపీ స్కూళ్లో కంప్యూటర్ ల్యాబ్ లు ఏర్పాటు చేశామన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఎంజేపీ స్కూల్లో విద్యనందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం చెల్లించకుండా మిగిల్చిన డైట్ ఛార్జీలను (రూ.76.38 కోట్లను) మా ప్రభుత్వం చెల్లించింది. వసతి గృహాల్లో ఎఫ్.ఆర్.ఎస్.(ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) అటెండెన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టామన్నారు. వసతి గృహాల భవనాల్లో మరమ్మతులకు రూ.13.10 కోట్లు మంజూరు చేశామన్నారు. 56 మంది ఎమ్మెల్యేలు సొంత నిధులు వెచ్చించి తమ నియోజక వర్గాల్లోని బీసీ హాస్టళ్లను మరమ్మతులు చేసినందుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. విజయనగరం, కర్నూలు ఎంపీలు రూ.కోటి చొప్పున ఎంపీ ల్యాడ్స్ నుంచి హాస్టళ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసిశారన్నారు. వసతి గృహాల్లోని పిల్లల మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహద పడేలా స్పోర్ట్స్ మెటీరియల్ అందజేయబోతున్నామన్నారు.
బీసీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్
త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో 26 జిల్లాల్లోనూ ఉచిత డీఎస్సీ కోచింగ్ నిర్వహించినట్లు మంత్రి సవిత వెల్లడించారు. మహిళలు, ఇతరుల కోసం కూడా ఆన్ లైన్ ద్వారా ఉచిత డీఎస్సీ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సివిల్ సర్వీసెస్ సిద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు కూడా ఉచిత శిక్షణ అందజేస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.
బీసీ, కాపు భవన్ల నిర్మాణానికి నిధులు మంజూరు
2014-19లో అప్పటి తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, కాపు భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. తరవాత వచ్చిన జగన్ ప్రభుత్వం ఆ నిర్మాణాలను పక్కనపడేసిందన్నారు. అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ, కాపు, మినీ కాపు కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
అక్రమ కేసులతో బీసీ నాయకుల వేధింపులు
గత ప్రభుత్వం బీసీలపైనా, ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులపైనా తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు పాల్పడిందని మంత్రి సవిత ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ నాయకులు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వంటి ఎందరో బీసీ నాయకులను గత ప్రభుత్వం జైల్లో పెట్టిందన్నారు. ’చివరికి సీఎం చంద్రబాబునాయుడు సహా మిమ్మల్ని కూడా గత ప్రభుత్వం జైల్లో పెట్టింది’ అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుని ఉద్దేశించి మంత్రి తెలిపారు. 200 మందికిపైగా బీసీలు హత్యకు గురయ్యారని. 2600 మందికిపైగా అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు.
బీసీలను మోసగించిన జగన్
ఒక్క ఛాన్స్ అంటూ బడుగు బలహీన వర్గాలతో ఓటేసుకుని అధికారంలోకి వచ్చిన జగన్ బీసీ బిడ్డలను అన్ని విధాలా అణగదొక్కారని మంత్రి సవిత మండిపడ్డారు. కరెంట్ ఛార్జీలు పెంచను అని చెప్పి 9 సార్లు కరెంట్ చార్జీలు పెంచారన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా పట్టించుకోలేదన్నారు. జగన్ అసమర్థ పాలన కారణంగా ఇరిగేషన్ రంగం పడకేసిందని, రైతులు నష్టపోయారని, ఇలా రంగం చూసినా బీసీలే నష్టపోయారన్నారు.
క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీల ఏర్పాటు
ముందు చూపుతో బ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీని సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారని, ప్రస్తుతం ఆ సొసైటీ రూ.200 కోట్ల టర్నోవర్ తో కార్యకలాపాలు సాగిస్తోందని మంత్రి తెలిపారు. బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ తరహాలో ఆర్యవైశ్య, క్షత్రియ, కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల కోసం కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలు ఏర్పాటు చేయనున్నామన్నారు.
బడుగులకు ఎమ్మెల్సీల పదవులపై కేటాయింపు మంత్రి హర్షం
5 ఎమ్మెల్సీల్లో టీడీపీకి దక్కిన మూడు ఎమ్మెల్సీలనూ బడుగులకు కేటాయించడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు చెందిన బీటీ నాయుడు, బీదా రవింద్రతో పాటు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీలుగా ఇచ్చినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం చంద్రబాబునాయుడుకు ఉన్న చిత్తశుద్ధి మరోసారి రుజువైందని మంత్రి సవిత తెలిపారు.
జారీచేసిన వారు : రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యుల వారి కార్యాలయం