
భీమిలికి ప్రతిరోజూ మంచినీరు ఇచ్చేలా ప్రణాళిక
జీవీఎంసీ కార్పొరేటర్లతో ఎమ్మెల్యే గంటా సమీక్ష
విశాఖపట్నం, ఫిబ్రవరి 10: భీమిలి నియోజవర్గం పరిధిలోని జీవీఎంసీ వార్డుల్లో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం సమీక్షించారు. భీమిలి జోన్ పరిధిలో రోజు విడిచి రోజు మంచినీరు ఇస్తున్నారని కార్పొరేటర్లు గాడు చిన్ని కుమారి లక్ష్మి ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. రూ.25 కోట్లతో ట్రీట్మెంట్ ప్లాంట్ తదితర పనులు మాట్లాడితే సమస్య పరిష్కారమై ప్రతి రోజూ నాణ్యమైన నీటిని భీమిలి ప్రజలకు ఇవ్వవచ్చని తెలిపారు. ప్రస్తుతం మిగిలిన ప్రాంతాలకు జీవీఎంసీ రోజూ మంచినీరు ఇస్తున్నారని, భీమిలి జోన్ లో కూడా అదే స్థాయి సరఫరా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తామని ఎమ్మెల్యే గంటా హామీ ఇచ్చారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడ, భీమిలి తదితర ప్రాంతాల్లో భూ ఆక్రమణల పట్ల కఠినంగా వ్యవహరించాలని కార్పొరేటర్లకు సూచించారు. దీని వల్ల ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి అస్తవ్యస్తంగా తయారవుతుందని, కబ్జాల విషయంలో ఉక్కుపాదం మోపాలన్నారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల గురించి జీవీఎంసీ సీఈ శివప్రసాద్ తో మాట్లాడి, వాటిని వేగవంతం చేయాలని ఆదేశించారు. పనుల మంజూరులో ఏక రూపత ఉండేలా చూడాలన్నారు. బిల్లాలమెట్ట కాలనీలో ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర నివేదిక తీసుకుని, నిజమైన లబ్దిదారులకు న్యాయం జరిగేలా చూస్తానని గంటా తెలిపారు. భీమిలి రోడ్ల విస్తరణ వెడల్పు ఏ మేరకు ఉండాలనేది స్థానికులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. భీమిలి, మధురవాడ జోన్ లలో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో సమస్యలను కార్పొరేటర్లు – ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. టీడ్కో ఇళ్ల కేటాయింపును త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. సింహాచలం టీవీ టవర్ కాలనీలో జీవీఎంసీ రోడ్ నిర్మాణాన్ని దేవస్థానం అడ్డుకోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై ఈఓ వి.త్రినాథరావుతో మాట్లాడి అభివృద్ధి పనులు అడ్డు కోవద్దన్నారు. కార్పొరేటర్లు గాడు చిన్ని కుమారి లక్ష్మి, మొల్లి హేమలత, పిల్లా మంగమ్మ, లొడగల అప్పారావు, పి.వి.నరసింహం, దాడి రమేష్ నాయుడు, పార్టీ నాయకులు గంటా నూకరాజు, గాడు అప్పలనాయుడు, మొల్లి లక్ష్మణరావు, పిల్లా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.